COMMITTED FOR CLEAN SOCIETY..
విశాఖ రాజధాని అయితే ప్రశాంతత పోతుంది , భూకబ్జాలు పెరిగిపోతాయి , ట్రాఫిక్ పెరిగిపోతాది.... ఇలాంటి న్యూస్ గత ఐదు ఏళ్ళు గా ఎన్నో చూసాం. ఆ ! రాజధాని అయినంత మాత్రాన విశాఖ గాని ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ అభివృద్ధి చెందిపోతుందా ? అని ప్రశ్నించిన మేధావులను చూసాం. అసలు రాజధాని కి అభివృద్ధి కి సంబంధం ఏమిటి ? అని అడిగిన అంతరిక్ష మేధావులను విన్నాం. మరి రాజధాని కాకముందు విశాఖ లో రౌడీయిజం , దోపిడీ లెవా ? విశాఖ లో రౌడీషీట్లు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి లెక్క తీయండి. మరి విశాఖ లో కాకుండా వేరేచోట రాజధాని పెడితే అక్కడ ప్రశాంతత పోదా ? అక్కడి ప్రజలు ప్రజలు కాదా ? సరే పోనీయండి. విశాఖ లో 2020 కి ముందు భూకబ్జాలు లెవా ? మరి సిట్ ఎందుకు వేశారు ? ట్రాఫిక్ పెరిగిపోతే ఫ్లైఓవర్ లు వేసుకోవచ్చు లేదా వేరే మార్గాలు చూసుకోవచ్చు. ఇది అసలు సమస్యే కాదు. పోనీయండి ఇది కూడా మర్చిపోదాం..
విశాఖ రాజధాని అయినంత మాత్రాన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందిపోతుందా ? అని అడిగేవాళ్ళు మరి రాజధాని వేరే చోటి నుండి విశాఖ కు తరలిపోతోంది అని అన్నప్పుడ్డు ఎందుకు అన్ని ఆందోళనలు చేసారు ? రాజధాని వచ్చినంత మాత్రాన అభివృద్ధి చెందనప్పుడు, అసెంబ్లీ ఎన్నికల తరువాత విశాఖ లో రాజధాని ఉండదు అన్నప్పుడు ఎందుకు అన్ని సంబరాలు చేసుకున్నారు. రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన వారు ఆందోళనలు , సంబరాలు చేసారు , ఏ రాజకీయ పార్టీ కి , మీడియా కి వాటి తో సంబంధం లేదు అని కాసేపు అనుకొందాం. మరి అక్కడ భూములిచ్చిన వారికి న్యాయం జరగాలి అంటే అక్కడే రాజధాని ఉండాలి అని విశాఖ ప్రజలకు చెప్పి ఉండవచ్చు కదా ? అలాకాకుండా పనికిమాలిన చెత్త అంతా ప్రచారం ఎందుకు చేశారు ? విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దారుణంగా పడేసారు. గత ఐదు సంవత్సరాలు గా విశాఖ మీద విషం కక్కుతూ వచ్చారు.
నెంబర్ 1 వార్త పత్రికగా చెప్పుకునే పత్రికలో ఒక సారి విశాఖ తీరం సమీపం లో బంగాళాఖాతం లో భూమి పొరల్లో ఒక పెద్ద చీలిక ఉందని, కొన్ని సంవత్సరాలలో నగరం మునిగిపోతుంది అని మొదటి పేజీ బ్యానర్ కధనం రాసారు. ఆ కధనం సారాంశం మొత్తం బూటకమే. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేని, ప్రజలను మోసం చేసే ప్రయత్నం అది. అంతేనా ! విశాఖ లో సునామీలు వస్తాయని, హుదూద్ లు వస్తాయని, ఈప్రాంతం సురక్షితం కాదు అన్ని కొన్ని పదుల కధనాలు. మరి ఈ వార్తలు చూసిన ఇండస్ట్రియలిస్టులు ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి విశాఖ కు వస్తారా ? విశాఖ మీద బురద చల్లడానికి LG Polymers ఘటనను మీడియా మాఫియా చాలా దారుణంగా వాడుకుంది. అరుదు గా జరిగే అటువంటి సంఘటనలు చూపించి విశాఖ కు అన్యాయం చేసారు.పరిశ్రమలలో ప్రమాదాలు ఎప్పుడూ ఎక్కడా జరగలేదా ? కొందరి నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన లో బాధ్యులను శిక్షించాలి కానీ ఒక నగరాన్ని శిక్షించడం ఏమిటి ?
వీళ్ళ మోసపు రాతలతో విశాఖ ఇమేజ్ కు తూట్లు పొడుస్తూనే వచ్చారు. అయితే విశాఖ లో ఎన్నికల ఫలితాలు అలా ఎందుకు వచ్చాయి అనవచ్చు. దీనికి సమాధానం సవాలక్ష కారణాలు. రాజధాని అయితే ఎదో జరిగిపోతుంది అనే విష ప్రచారాన్ని నమ్మి రాజధాని వద్దు అని ప్రజలు అనుకోని ఉండవచ్చు, రాజధాని విషయం వాళ్ళ priorities లో ఉండిఉండకపోవచ్చు, వేరే అంశాలు dominate చేసి ఉండవచ్చు, విశాఖ లో settlers ఎక్కువ కావడం వల్ల కావచ్చు, మీడియా ప్రచారం చేసినట్టు విశాఖ ప్రజల అమాయకత్వం కావచ్చు, ఇలా ఎన్నో కారణాలు.
ఆంధ్రుల రాజధాని గా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయి. విశాఖ రాజధాని అయితే మరో ముంబై , చెన్నై తరహాలో తయారు అయ్యి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగపడేది. శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ లో రాజధాని గా విశాఖ కూడా ఒక ఆప్షన్ కదా ? అసలు శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఏమయ్యింది ? అది ఎప్పుడో మాయం అయ్యింది లేండి. ఇలాంటి మాయలు మన రాష్ట్రము లో ఒకటా రెండా ? రాష్ట్ర విభజన సమయం లో కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ గురించి ప్రభుత్వాలు మర్చిపోయాయి , ప్రజలు మర్చిపోయారు. మనము అందరమూ 'గజని'లము కదా.సరే, ఏది ఏమైనా ఆంధ్ర రాజధాని ఇక ఖరారు అయిపొయింది కాబట్టి , ఇకనైనా విశాఖ ను ప్రశాంతంగా ఉండనివ్వండి అని మీడియా కు విన్నపం.
రుషికొండ మీద నిర్మాణాలను ప్రకృతి రక్షణ పేరు తో అడ్డుకున్న అద్భుత మేధావులకు వందనం. ఒక్కసారి రుషికొండ చుట్టుపక్కనున్న ఈ నిర్మాణాలను కూడా చూడండి..ప్రకృతి విధ్వంసం చెయ్యకుండా రామానాయుడు ఫిలిం స్టూడియో ఎలా నిర్మించారు ?
మిరాకిల్ సంస్థ తన ఆఫీస్ ను రుషికొండ సమీపంలోని కొండ మీద కట్టినప్పుడు ప్రకృతి విధ్వంసం జరగకుండా ఏమైనా మిరాకిల్ చేసారా ?
చెట్లు కొట్టకుండా ... కొండను తొలిచేయ్యకుండా ఈ నిర్మాణాలు సాధ్యమా ?
IT SEZ HILLS మీద నిర్మాణాలు అన్ని ఎలా కట్టారు ? సరే IT సెజ్ విశాఖ అభివృద్ధికోసం కదా అని అనుకుంటే మరి అక్కడి సమీప కొండలమీద ప్రైవేట్ నిర్మాణాలు ఎలా అనుమతించాయి మన వ్యవస్థలు ? కొండలు తొలిచేయకుండా బీచ్ రోడ్ విస్తరించడం ఎలా సాధ్యం ?
తిమ్మాపురం లోని వైజాగ్ ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీ నిర్మించినప్పుడు జరిగింది ప్రకృతి విధ్వంసం కాకపోతే లోకకళ్యాణమా ?రుషికొండ లోని ప్రేమ వెల్నెస్ రిసార్ట్ , RADDISSON BLU HOTEL వంటివి కట్టినప్పుడు కుహనా ప్రకృతి రక్షకులు అందరు కళ్ళు లేని కాబోదులయ్యారా ?
ఆధునిక మానవుడు చేసే ప్రతీ అభివృద్ధి వెనుక ప్రకృతి విధ్వంశం ఉంటాది. అయితే ఇక్కడ అభివృద్ధి చెయ్యటం ఆపేయాలా ? లేక ప్రకృతిని రక్షించడం ఆపేయాలా ? అంటే రెండు కాదు. రెండిటిని బ్యాలన్స్ చెయ్యటమే మనిషి చెయ్యవలసినది. ప్రకృతి విధ్వంశం శృతి మించకూడదు.ఒక చెట్టు నరికితే , పది మొక్కలు నాటి సంరక్షించాలి. ఆ సమతూకం పాటించడం ముఖ్యం. ఈ విషయం రుషికొండ నిర్మాణాల మీద పడి ఏడ్చిన వాళ్లకి కూడా తెలుసు కాకపోతే విశాఖ కి రాజధాని వస్తాదేమో అని చూసి ఓర్వలేని వాళ్ళు చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రకృతి పేరు తో వాళ్ళు చేసిన నానా యాగీ అంతా బూటకమే.
ఫోర్త్ ఎస్టేట్ , అదే మీడియా ఆంధ్ర రాష్ట్రము లో ఎప్పుడో మూతపడిపోయింది. ఇప్పుడు తెలుగు లో దినపత్రికలు లేవు , ఛానళ్ళు లేవు. ఇప్పుడు మీడియా పేరుతో జరిగేది అంతా మోసమే, ఇప్పుడున్న దినపత్రికలని, ఛానెళ్ల ని ఆ పేరుతో కాకుండా కొత్త పదాన్ని నిర్వచించి పిలవాలి. జర్నలిస్టులు లేరు అని అనలేము కానీ, ఉన్న జర్నలిస్ట్ లు తక్కువ ( అంటే మేము మాట్లాడేది అసలైన సమాజ హితంలో పనిచేసే జర్నలిస్టుల గురించి ), వాళ్ళ గొంతుక వినేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు ఎవరు ? సరే , విషయానికి వస్తే ఈ రోజు (11-06-2024) ఒక ప్రముఖ దినపత్రికలో, అదే ఒక ప్రముఖ పాంఫ్లెట్ లో , 'జే బ్రాండ్లకు చెక్' అని. ఇది చూసిన వెంటనే కలిగే ఆలోచన ఏంటి అంటే ఇన్నాళ్లు వీళ్ళు విమర్శిస్తూ వస్తున్న కొన్ని మద్యం బ్రాండ్లను రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసిందేమో అని. కానీ వివరాల్లోకి వెళ్లి చూస్తే వీళ్ళ ఆనందం ఏంటి అంటే కొన్ని మద్యం బ్రాండ్లు మళ్ళీ మన రాష్ట్రం లోకి రాబోతున్నాయని. kingfisher బ్రాండ్ వచ్చేసిందని , మాన్షన్ హౌస్ , బ్లెండర్స్ ప్రైడ్ వంటి బ్రాండ్లు రాబోతున్నాయని వీళ్ళ ఆనందం. ఒకప్పుడు మద్య నిషేధం కోసం పోరాడిన ఆంధ్ర మీడియా ఇప్పుడు కొత్త బ్రాండ్లు వస్తున్నాయని ఆనంద పడుతోంది. అసలు మద్యమే అనారోగ్యకరం కదా? మళ్ళీ ఆ బ్రాండు ,ఈ బ్రాండు ఏమిటి. బాధ్యత కలిగిన మీడియా మద్య పాన నిషేధం కోసం పోరాడాలి కానీ , పాత బ్రాండ్లు కావలి అని కాన్వస్సింగ్ చెయ్యడం ఏమిటి. మరో television ఛానల్ అయితే మంచి బ్రాండ్లు కావాలని మందుబాబులు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఒక వైపు చెబుతూ మళ్ళీ మహిళలు మద్య పాన నిషేధం చెయ్యలేదని పాత ప్రభుత్వాన్ని ఓడించారని కధనాలు ప్రసారం చేసింది. ఏది నిజం ? మరి ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తారా ? ఈ మీడియా కధనాల ప్రకారం కొత్త లిక్కర్ పాలసీ అద్భుతంగా ఉండబోతోందంట ! ఏంటి అంటే , ప్రభుత్వ మద్యం షాపులు తీసేసి ప్రైవేట్ మద్యం షాపులకు మళ్ళీ అనుమతి ఇవ్వబోతున్నారు అంట ! మద్యం రేట్లను తగ్గించబోతున్నారు అంట ! అంటే ఇంకా ఇంకా తాగమని ప్రోత్సహించబోతున్నారు అన్నమాట. మరి మద్యపాన నిషేధం చెయ్యలేదని పాత ప్రభుత్వాన్ని ఓడించిన మహిళలు , ఈ కొత్త పాలసీ ని ఆమోదిస్తారా ? పూర్తి నిషేధం ఎలాగో చెయ్యరు కానీ , కనీసం వీళ్ళు విమర్సించిన పాత బ్రాండ్లను అయినా నిషేదిస్తారా ? చూద్దాం.
DT 04-06-2024
It is the duty of every elected government to follow and implement the manifesto. 'Jana Galam' will surely follow up for this.
ఈ 'లజ్జ' సిరీస్ ఉద్దేశం మంచి జర్నలిజం ను సమాజానికి అందిస్తూ మీడియా లో జరుగుతున్నా విపరీత పోకడలను అందరికీ చెప్పాలని.
ప్రజాస్వామ్యంలో మీడియా ని 'ఫోర్త్ ఎస్టేట్' అని ఎందుకు అంటారు ? అసలు 'ఫోర్త్ ఎస్టేట్' అంటే ఏమిటి ? ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూటివ్ వింగ్ ని ఫస్ట్ ఎస్టేట్ అని , శాసన వ్యవస్థ ని సెకండ్ ఎస్టేట్ అని , న్యాయ వ్యవస్థని థర్డ్ ఎస్టేట్ అని పిలుస్తారు. మీడియా కి ఫోర్త్ ఎస్టేట్ అని పేరు పెట్టి , అటువంటి ముఖ్యమైన వ్యవస్థల పక్కన కూర్చోపెట్టారు . అంటే మీడియా పాత్ర అంట ముఖ్యమని అందరూ గుర్తించారు. సమాజంలో జరిగే లేదా జరుగుతున్నా యదార్ధాలను ప్రజలకు చెప్పడం , ముఖ్యమైన విషయాలలో సమాజంలో చైతన్యం కలిగించడం , మంచి విషయాలు చెప్పి సమాజం లో ఉన్నత భావాలూ పెంపొందించడం , ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని యధావిధిగా చెప్పడం , ప్రతీ విషయం లో ప్రజల పక్షాన నిలబడటం , ఇలాంటి అనేక ముఖ్య బాధ్యతలు మీడియా భుజాన ఉండటం వాళ్ళ దానిని ఫోర్త్ ఎస్టేట్ అని అంటారు. అంటే ప్రజాస్వామ్య మూలస్థంభాలలో మీడియా ఒకటి. చరిత్రలో ఎన్నోసార్లు మీడియా ప్రజల పక్షాన పోరాడింది. ఎన్నో విషయాల్లో చైతన్యం కలిగించి దేశాన్ని కాపాడింది. మీడియా లేని నాగరిక ప్రపంచాన్ని ఊహించడం కష్టం. మన దేశ స్వతంత్య్ర సాధనలో మీడియా పాత్ర ముఖ్యమైనది.
జర్నలిజం ఒక శాంతియుత ఆయుధం,
జర్నలిజం ఒక భావ స్వాతంత్య్రం,
జర్నలిజం ఒక అందమైన కవిత్వం,
విలువల తో కూడిన జర్నలిజం లేని సమాజం,
దారి తెన్నూ లేని కూపస్థ మండూకం.
అలాంటిది ఈరోజు జర్నలిజం పరిస్థితి ఏంటి ? దానికి ఉన్న విశ్వసనీయత ఎంత ? జర్నలిజం ఒకప్పుడు సమాజం దృష్టిలో ఎంతో గౌరవప్రదమైన వృత్తి. ఒకప్పుడు జర్నలిస్టులు అంటే వారికి ఎంతో గౌరవం దక్కేది. అలాంటిది ఇప్పుడు జర్నలిస్టులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. జర్నలిస్టులను నమ్మలేని వ్యక్తులుగా , అబద్దాలు చెప్పేవారిగా , విశ్వసనీయత లేని వ్యక్తులుగా సమాజం చూస్తోంది. మరి అందరు జర్నలిస్టులు అలాగే ఉన్నారా అంటే కాదు. ఇప్పటికీ వృత్తి పట్ల ఎంతో అంకితభావంతో ఉండే జర్నలిస్టులు ఎంతో మంది ఉన్నారు. మరి తప్పు ఎక్కడ జరుగుతోంది ? మనం సోషల్ మీడియా గురించి తరువాత మాట్లాడుకుందాం . మెయిన్ స్ట్రీమ్ మీడియా దాదాపుగా కార్పొరేట్ సంస్థల చేతుల్లో చిక్కుబడిపోయింది. మీడియా సంస్థల మానేజ్మెంట్లు మీడియా ను కూడా ఫక్తు వ్యాపారంగా చూడటం, అంతే కాకుండా వాళ్లకున్న ఇతర వ్యాపార , రాజకీయ అవసరాలను తీర్చుకోవటం కోసం మీడియా ను కీలు బొమ్మగా వాడుకోవటం లోనే అసలు సమస్య అంతా దాగి ఉంది.
జర్నలిజం పట్ల నిబద్ధత కలిగిన వాళ్ళు మీడియా నిర్వహణ లో పెరుగుతున్న ఖర్చుల వల్ల, సమాజం లో పెరుగుతున్న కార్పొరేట్ పోకడల వల్ల మీడియా సంస్థలను నడపడం కష్టంగా మారుతోంది. నిబద్దతతో కూడిన జర్నలిజం చేస్తూ ఆస్తులను అమ్ముకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
కానీ అటువంటి జర్నలిస్టులు ఇప్పుడు లేరు అని కాదు కానీ మెజారిటీ మీడియా సంస్థలు ఇప్పుడు చేసేది జర్నలిజం కాదు , జర్నలిజం పేరుతో వ్యాపారం. ఇది జీతం కోసం ఉద్యోగం చేసుకునే సాధారణ జర్నలిస్ట్ తప్పు కాదు , మీడియా ను కూడా మామూలు వ్యాపారంగానో లేదా అడ్డదార్లు తొక్కి కోట్లు కొల్లగొట్టుకోవాలి అని అనుకునే మీడియా సంస్థలది , వాళ్ళని వాడుకునే రాజకీయ పార్టీలది.
ఇక తెలుగు మీడియా పరిస్థితి మరీ ఘోరం. మెయిన్ స్ట్రీమ్ తెలుగు మీడియా లో మెజారిటీ సంస్థలు చేసే జర్నలిజం , అదేమీ జర్నలిజం అనేది ఎంత బుర్ర బాదుకున్నా అర్ధం కాదు. నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తారు. పూర్తి భావ దారిద్య్రం తో సతమతమౌతుంటారు. పూర్తి పక్షపాతం తో ఎటో ఒక వైపు , ఎదో ఒక రాజకీయ పార్టీవైపు ఒరిగిపోయి ఉంటారు, ధనికులకు ఒక న్యాయం సామాన్యునికి ఒక న్యాయం అనేట్టు వ్యవహరిస్తుంటారు, డబ్బు సంపాదనే ధ్యేయంగా పని చేస్తూ ఉంటారు , తమకు ఇష్టమైన లేదా ఆర్ధిక అవసరాలను తీర్చే రాజకీయ పార్టీ లను , నాయకులను సమాజం మీద రుద్దుతూఉంటారు , తాము చెప్పేదే నిజమని ప్రజలను నమ్మించి మోసం చెయ్యాలని చూస్తుంటారు , తమ తప్పులను ఎత్తి చూపితే సమాజ ద్రోహులుగా ముద్ర వేస్తూ ఉంటారు , ప్రగతికి అడ్డుపడుతూ ఉంటారు , సమాజం లో విధ్వంసం సృష్టించేవాళ్ళు తమవాళ్లు అయితే చూసీచూడనట్టు పోతూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే నేటి తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా లో మెజారిటీ మీడియా ఎన్నో అవలక్షణాలతో సతమతమౌతోంది, జర్నలిజం లో విలువలను ధ్వంసం చేస్తోంది. అటువంటి వారికి 'Nani's Voice' అడిగే ప్రశ్న ఒక్కటే , " ఇలా చెయ్యటానికి లజ్జ లేదా సోదరా ?"
Copyright © 2024 NANI'S VOICE - All Rights Reserved.
Powered by GoDaddy
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.