గమనిక : ఈ టింకాపురం కథలు పేజీ పూర్తిగా కాల్పనిక కధలు మాత్రమే . నిజ జీవితం లోని ఏ వ్యక్తిని , వ్యక్తులను , వ్యవస్థలను లేదా సమూహాలను ఉద్దేశించినది కాదు. అనుకోకుండా ఏదైనా పోలికలు ఎవరికైనా కనిపిస్తే అది యాదృచ్చికం మాత్రమే.
అనగనగా ఒక ఊరు ఉంది ఆ ఊరి పేరు టింకాపురం. ఆ ఊరు ప్రకృతి దేశం లో ని శ్రీప్రదేశం అనే రాష్ట్రము లొ ఉంది. ఈ కధల లోని సంఘటనలు కల్పిత సంఘటనలు.ఆ ఊరి లో ఒక కుటుంబం ఉంది . ఆ కుటుంబానికి హీరో 'టింకు'. మిగిలిన విషయాలు రాబోయే కథలలో మాట్లాడుకుందాం.
ఆదివారం ఉదయాన్నే మంచంలోంచి లెగవటానికి బద్ధకిస్తున్న టింకుగాడిని త్వరగా నిద్ర లేపటానికి వాళ్ళ అమ్మ ప్రయోగించే అస్త్రం, " నాన్నా! ఈ రోజు మనకి లంచ్ లో కోడి కూర " అని. ఆమాట వినగానే ఠక్కున లేచి కూర్చుంటాడు టింకు. వాడికి కోడి కూర అంటే అంత ఇష్టం మరి. అందుకే ఈమధ్య వాడిని ' కోడి కూర టింకు ' అని కూడా పిలుస్తున్నారు. టింకు కి మాత్రం ఆ పేరు ఎందుకో నచ్చలేదు. టింకు గాడు వాళ్ళ నాన్నతో ' నాన్నా! నన్ను అలా పిలవకు' అన్నాడు. 'ఎరా?' అన్నాడు రింకు. 'నువ్వు అలా పిలుస్తుంటే నాకు ఈ మధ్య న్యూస్ పేపర్లో చదువుతున్న ఒక పేరు గుర్తువస్తుంది.' అన్నాడు టింకు. విషయం అర్ధమయ్యి గట్టిగా నవ్వేసాడు రింకు. ' అయినా , ఆ వ్యక్తి జైలు లో ఉన్నప్పుడు కొంత మంది ఒక హీరో కి ఇచ్చిన బిల్డుప్ ఇచ్చి , జైలు నుంచి వచ్చినప్పుడు పూల దండలు వేసి స్వాగతం చెప్పారుగా ? అలాంటి వ్యక్తితో పోలిస్తే ఏంటి ?' అన్నాడు రింకు.
వీళ్ళ మాటలు విని , " అసలు ' కోడి చాకు రీను' అనే వ్యక్తి ఏమి చేసాడు రా ?' అన్నాడు మింకు (మింకు , టింకు మంచి స్నేహితులు లేండి). ' వాడు ఒక ముఖ్య నాయకుడిని చాకు తో పొడిచాడురా' అన్నాడు టింకు. ' అలాంటప్పుడు ఆతను నేరస్థుడు అవుతాడు కదా ?' అమాయకంగా అన్నాడు మింకు. ' అవును! కానీ పొడిచింది కోడి చాకు తో నే కదా! అదికూడా భుజం మీదే కదా ! కాబట్టి అదేమీ పెద్ద నేరం కాదని కొందరి వాదన.' అన్నాడు టింకు వాళ్ళ నాన్నా రింకు. ' అదేంటి అంకుల్ ! దాడి సమయంలో భుజం పక్కనే ఉన్న గొంతు లో ఆ చాకు గూర్చుకుంటే ఆ ముఖ్యనాయకునికి ప్రాణాపాయమే కదా' మళ్ళీ అమాయకంగా అడిగాడు మింకు. ' అవును. అటువంటి వ్యక్తి జైలు లో ఉంటే, దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తుంటే , కోర్టులు ట్రయిల్ నిర్వహిస్తుంటే, కొందరు అతి తెలివితో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఒక కులాన్ని అణగదొక్కడం కోసం అతన్ని జైలు లో పెట్టారని వింత వింత వాదనలు చేస్తున్నారు. పైగా నిన్న జైలునుండి బయటకు వచ్చినప్పుడు రకరకాల సంఘాలవాళ్ళు వెళ్లి పూల దండలు తో స్వాగత సత్కారాలు చేసారు. ఇది సమాజం లో ఉన్న విపరీత పోకడలకు ఒక ఉదాహరణ మాత్రమే ' అన్నాడు రింకు. ' అవును నాన్నా! ఇలా జరగటం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా కొంత మంది నేరస్థులు జైలునుండి వచ్చినప్పుడు ఇలాగే సత్కారాలు చేశారు. ఇలా చేస్తే వాళ్లకి మీడియా కూడా చీప్ పబ్లిసిటీ ఇస్తోంది. ఆ పబ్లిసిటీ కోసం కొంత మంది అలా విపరీతం గా ప్రవర్తిస్తున్నారు. అలాంటి నేరస్థులను , వాళ్ళను హీరోలు గా చిత్రీకరించే వాళ్ళను , వాళ్లకు పబ్లిసిటీ ఇచ్చే మీడియా ను మనం అందరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించ కూడదు' అన్నాడు టింకు. ' అవును ! టింకు ,చిన్న పిల్లలైనా మీకు ఉన్న ఈ లోకజ్ఞానం చాలా మంది పెద్దవాళ్లకు ఉండట్లేదు. పెద్దరికం అనేది వయస్సు తో రాదు పరిణితి చెందిన ఆలోచనలతో వస్తాది ' అన్నాడు రింకు.
టింకు గాడు ఫిఫ్త్ క్లాస్ కి వచ్చాడు. ఇప్పుడు కొత్తగా వాడికి స్కూల్ లో సివిక్స్ సబ్జెక్టు కూడా చెప్పడం స్టార్ట్ చేసారు. కానీ మన హీరో షార్ప్ కదా అందుకే టీచర్ సివిక్స్ మొదటి చాప్టర్ పూర్తి చేయకముందే చాలా వరకు సివిక్స్ పుస్తకాన్ని చదివేశాడు. ఒక రోజు వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి , " నాన్న నేను సివిక్స్ చదవటాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నా, ఈ సబ్జెక్టు లో నేర్చుకున్న విషయాలు ఏవీ నేను జీవితం లో మర్చిపోను. నేను పెద్దయ్యాక ఏ ఫీల్డ్ లో జాబ్ చేసినా , ఈ టాపిక్స్ అన్నింటినీ గుర్తు పెట్టుకుని ప్రవర్తిస్తాను. " అన్నాడు. దానికి ఆశ్చర్యపోయిన వాళ్ళ నాన్న ' రింకు ' , " అవునా ! ఆ సబ్జెక్టు లో నీకు అంతగా నచ్చింది ఏంటి నాన్నా ! " అన్నాడు.
ఈ ప్రశ్న కు టింకు ఈ విధంగా సమాధానం చెప్పసాగాడు: " సివిక్స్ అంటే ఒక దేశ పౌరుల బాధ్యతలు , హక్కుల గురించి తెలియజెప్పే సోషల్ సైన్స్. అలాగే మన దేశ ప్రజాస్వామ్యం , మన వ్యవస్థ లో ఉండే వివిధ ముఖ్య వ్యవస్థలు , ప్రభుత్వం , పార్లమెంట్ , ఫెడరల్ వ్యవస్థ వగైరా విషయాల గురించి చెప్పే మంచి సబ్జెక్టు. ఈ సబ్జెక్టు చదవటం మొదలుపెట్టినాక నాకు మన దేశ రాజ్యాంగం గురించి పూర్తి గా తెలుసుకోవాలని ఆసక్తి ఏర్పడింది." దీనికి ' రింకు ' , " మంచిది. మరి నువ్వు నేర్చుకున్న ఎదో ఒక విషయం గురించి చెప్పు , నీకు ఎంతవరకు అర్ధమైందో నేను తెలుసుకుంటా." అన్నాడు.
" అయితే నేను మన ప్రకృతి దేశం యొక్క శాసన వ్యవస్థ గురించి చెబుతా, నాన్న. మనది ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం. దేశం లో రాష్ట్రాలలో అలాగే కేంద్రంలో కూడా ఏర్పడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలు , పార్లమెంటు , శాసన సభల ద్వారా కొన్ని శాసనాలు చేస్తాయి. ప్రభుత్వాలు ప్రజలకు ఈ సభల ద్వారా జవాబుదారీ గా ఉంటాయి. ఈ సభలలో చేసిన శాసనాలు నచ్చితే ప్రజలు మళ్లీ ఆ ప్రభుత్వానికి ఓటు వేస్తారు లేదంటే లేదు . ప్రజాస్వామ్యం అంటే ప్రజలే ప్రభుత్వాధినేతలు అని అర్ధం. మన రాజ్యాంగం లో ఎవరి విధులు ఏంటి అధికారాలు ఏంటి అనేది స్పష్టంగా చెప్పారు. శాసనాలు చెయ్యటమే శాసన వ్యవస్థల ముఖ్యమైన విధి."
ఈ సమాధానం విని ' రింకు ' ఉబ్బి తబ్బిబ్బు అయిపోయాడు. దాదాపు ఆనందభాష్పాలు పెట్టుకున్నంత పని చేసాడు. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న రింకు స్నేహితుడు 'ఆనంద్' కు కొంత వింతగా అనిపించింది. " ఒరేయ్ ! రింకు స్కూల్ లో ఈ సబ్జెక్టు నేర్చుకోవటం అనేది సాధారణమే కదా ? అందరూ నేర్చుకునేది కదా ? మరి నువ్వెందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నావ్ ? " అని అడిగాడు. దానికి రింకు , " ఆనంద్ , నేను ఆనంద పడుతున్నది టీంకు చెప్పిన సబ్జెక్టు మేటర్ గురించి కాదు. నువ్వు అన్నట్టు అది అందరూ స్కూల్ లో నేర్చుకునేదే. కానీ వాడు మొదట్లో చెప్పాడు చూసావా ! నేను ఈ విషయాలు మర్చిపోకుండా పెద్దయ్యాక ఏ ఫీల్డ్ లో ఉన్న ఈ విషయాలను పాటిస్తాను అని అన్నాడు. అంటే రాజ్యాంగానికి గౌరవం ఇవ్వాలి అని ప్రాధమిక సూత్రం వాడికి బాగా అర్ధం అయ్యింది. అది చాలు వాడు ఒక మంచి పౌరుడు అవ్వటానికి. అందుకు నాకు చాలా సంతోషం వేసింది." అన్నాడు. దానికి ఆనంద్ , " నిజమేరా ! టింకూ గాడికి ఉన్న Constitutional Sense మన సొసైటీ లో కొంతమంది పెద్దరాయుళ్ళకి కూడా ఉండట్లేదు" అన్నాడు.
కథ కంచికి మనం మన పనుల్లోకి.
అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊరి పేరు టింకాపురం. ఆ ఊరి లో ఉన్న 'టింకు' నే మన హీరో . అతని వయస్సు పది సంవత్సరాలు. టింకు నాన్న పేరు 'రింకు'. ఒక రోజు తెల్లవారే టింకు సీరియస్ గా 'ఆనాడు' అనే తెలుగు న్యూస్ పేపర్ ను చదువుతున్నాడు. అది చూసి రింకు , " ఎరా ? న్యూస్ పేపర్ ను అంత ఏకాగ్రత తో చదువుతున్నావ్ ? " అని అడిగారు. " నాన్నా , తెలుగు బాగా నేర్చుకోవటం కోసం మా టీచర్ తెలుగు న్యూస్ పేపర్ చదవమన్నారు " అని అన్నాడు. " నీకు తెలుగు బాగా నేర్చుకోవాలంటే చక్కగా మంచి కధల పుస్తకాలూ మన దగ్గర ఉన్నాయి , అవి చదువుకో లేదా అద్భుతమైన తెలుగు సాహిత్యానికి సంబంధించి పుస్తకాల పేర్లు చెబుతాను , అవి తెప్పించుకుని చదువుకో , అంతే కానీ ఇలాంటి న్యూస్ పేపర్ లు మాత్రం చదవకు." అన్నారు రింకు. దానికి ఆశ్చర్యపోయిన టింకు, " అదేంటి నాన్న నేను న్యూస్ పేపర్ చదువుతుంటే మెచ్చుకుంటావు అనుకున్నా. న్యూస్ పేపర్ చదివితే మంచి జనరల్ నాలెడ్జి వస్తుంది కదా ? పైగా మన తెలుగు జర్నలిజానికి మంచి చరిత్ర ఉందని , ఎంతో మంది అద్భుతమైన జర్నలిస్టులు ఉండేవారని మా టీచర్ చెప్పారు. మరి ఎందుకు చదవొద్దు అంటున్నావు ?" అని అడిగాడు టింకు.
ఈ ప్రశ్నకు రింకు ఇలా సమాధానం చెప్పాడు , "ఔను ! నిజమే తెలుగు జర్నలిజానికి ఉత్కృష్టమైన చరిత్ర ఉంది. ఎంతో అద్భుతమైన జర్నలిస్టులను ఇంతకు ముందు తరాలు చూసారు. Free press is very much essential for the survival of any democratic state. Press in its genuine form is really a fourth pillar or fourth estate of any democratic society. కానీ ఇప్పుడు అటువంటి నిజమైన జర్నలిస్టులను , మీడియాను చూడాలంటే చాలా కష్టం. మైక్రోస్కోప్ పెట్టి వెతికినా దొరకటం కష్టం. అలాగని నిజమైన జర్నలిస్టులు అస్సలు లేరని కాదు. కానీ మీడియా ఓనర్లు చెప్పినట్లు నడుచుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు కూడా తమ పనికి నిజమైన న్యాయం చేయలేకపోతున్నారు. చాలా మీడియా సంస్థలు ఎదో ఒక రకంగా తమ జర్నలిజం ను ఎదో ఒక పొలిటికల్ పార్టీ కో , బిజినెస్ హౌసెస్ కో పణంగా పెట్టడం చాలా సాధారణం అయిపొయింది . జనాలు కూడా మీడియా ను నమ్మటం చాలా వరకు మానేశారు. మీడియా చూపించేది లేదా రాసేది ప్రతిదీ నిజమే అని నమ్మే పరిస్థితి లేదు. చాలా వరకు వార్తలను తమకు ఇష్టమైన కోణం నుంచే కవర్ చేస్తున్నారు. ఉన్నది ఉన్నట్టుగా కవర్ చేయటం మానేసి తమ ఇష్టాలను జనాలమీద రుద్దుతున్నారు. న్యూస్ ఆర్టికల్ కు , ఎడిటోరియల్ కాలమ్ కు తేడా లేకుండా అయిపొయింది. న్యూస్ పేపర్ లు అయినా , ఎలక్ట్రానిక్ మీడియా అయినా అదే పరిస్థితి . అలాగని మన తెలుగు జర్నలిజం లో విలువలు కలిగిన జర్నలిస్టులు లేదా మీడియా సంస్థలు అస్సలు లేవని కాదు కానీ ఉన్న పరిస్థితులలో అలాంటి వాళ్ళు మనుగడ సాగించడమే కష్టం.ఆ మాటకొస్తే ఈ పరిస్థితి ఒక్క తెలుగు జర్నలిజం లో మాత్రమే ఉన్న పరిస్థితి కాదు , అన్నిచోట్లా నిజమైన మీడియా ఉనికే ప్రమాదం లో ఉంది. అందుకే అంటున్నా 'ఆనాడు' , ' దీపం' , ' రుజువు' లాంటి న్యూస్ పేపర్ లు చదివితే నీకు అసలు నిజాలు తెలియక పోవచ్చు. మీ టీచర్ చెప్పినట్టు , న్యూస్ పేపర్ చదవటం మంచి అలవాటే కానీ ఏప్రిల్ ఒకటినే కాకుండా రోజూ మనల్ని ఫూల్స్ ని చెయ్యాలని ప్రయత్నించే పేపర్ లు చదివే కన్నా తెలుగు లో నే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ , ఉన్నది ఉన్నట్టు గా చెప్పే న్యూస్ పేపర్ ల ను వెతికి వాటిని చదవటం లేదా వేరే భాషలో అయినా జెన్యూన్ న్యూస్ రాసే న్యూస్ పేపర్స్ చదవటం మంచిది.."
'రింకు' ఇలా అనేసరికి న్యూస్ ని జరిగింది జరిగినట్టుగా చెప్పే తెలుగు న్యూస్ పేపర్స్ , న్యూస్ ఛానెల్స్ , వెబ్ మీడియా కోసం వెతకసాగాడు 'టింకు'. టింకు ఈ మిషన్ లో సక్సెస్ అయ్యాడో లేదో మనం ఈజీ గా ఊహించుకోవచ్చు.
Copyright © 2024 NANI'S VOICE - All Rights Reserved.
Powered by GoDaddy
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.