విశాఖ ఒక మహా నగరం . ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా విశాఖ ఒక అద్భుత నగరం గా కొన్ని విషయాలలో హైదరాబాద్ కు పోటీగా ముందడుగులు వేసింది. 'సిటీ అఫ్ డెస్టినీ' అని ఏ ముహూర్తాన ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ శ్రీ కట్టమంచి రామలింగ రెడ్డి మొదటిసారి అన్నారో గాని , విశాఖ కు ఆ పేరు సరిగ్గా సరిపోతుంది. ఒకవైపు బంగాళాఖాతం మరో మూడువైపులా తూర్పు కనుమలతో ఎంతో అందంగా ఉండే ఈ నగరం కేవలం ఒక టూరిస్ట్ డెస్టినేషన్ మాత్రమేనా ? ఎంతమాత్రం కాదు. టూరిజం అభివృద్ధికి విశాఖ ఎంతో అందమైన ప్రాంతం. అందులో ఎటువంటి సందేహం లేదు. విశాల తీర ప్రాంతం , తూర్పు కనుమలు , ఎర్రమట్టి దిబ్బలు , కైలాసగిరి, అరకు తో కూడిన ఏజెన్సీ ప్రాంతం , సింహాచల మహాక్షేత్రం మొదలగు ప్రాంతాలు ఈ నగరాన్ని భారతదేశంలోనే ఒక విశిష్ట నగరం గా నిలబెట్టాయి. ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే నిజంగా విశాఖ నగరం టూరిజం పరంగా అయినా అభివృద్ధి చెందిందా అంటే జరగాల్సినంత జరగలేదు. ఆ విషయం లోను విశాఖకు ఎన్నో ఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉంది. అన్యాయం అంత వరకే పరిమితం కాలేదు. ఉమ్మడి రాష్ట్రము లో హైదరాబాద్ కేంద్రీకుతం గా జరిగిన అభివృద్ధి లో ఎక్కువగా నష్టపోయినది విశాఖ నగరమే. మరి ఇప్పుడు విశాఖ నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలేదా ? అంటే దానికి సమాధానం అభివృద్ధి చెందింది కానీ చెందాల్సినంత కాదు. ఈ అభివృద్ధి కూడా విశాఖ కు సహజం గా ఉన్న ప్లస్ పాయింట్స్ వల్ల కాల క్రమంలో జరిగినదే కానీ ఎవరో ప్రత్యేకించి చేసినదో లేక ప్రమోట్ చేసి చేసినదో కాదు. సరే మన హెడ్లైన్ కి ఈ ఉపోద్ఘాతానికి సంబంధం ఏంటి అంటారా ? ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు మనం పరిశీలించాలి. విశాఖ ను రాష్ట్ర రాజధానిగా చేస్తే రాష్ట్రానికి ఏమి ఉపయోగం ? మరోకోణం లో మనం చూడాల్సినది విశాఖ కు లేదా ఉత్తరాంధ్ర కు ఏమి ప్రయోజనం ?
మొట్ట మొదటగా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఆ కోణం లో ఆలోచించినప్పుడు అసలు ఒక రాష్ట్ర రాజధానికి ఉండాల్సిన ప్రాధమిక లక్షణాలు ఏంటి ? ఒక నగరం రాజధాని అవ్వాలంటే మౌళిక సదుపాయాలు పటిష్టంగా ఉండాలి. ఈ విషయం లో విశాఖ నగరమే ఆంధ్ర రాష్ట్రము లో నెంబర్ 1 . విశాఖ లో ప్రపంచ శ్రేణి సదుపాయాలు ఉన్నాయి. అద్భుతమైన సీ కనెక్టివిటీ , ఎయిర్ మరియు రోడ్ కనెక్టివిటీ ఉన్నాయి. టూరిజం పరంగా ఇంకా ఎంతో ముందుకు వెళ్లగలిగే పరిస్థితి ఉంది. అందరిని కలుపుకువెళ్ళే కాస్మోపాలిటన్ కల్చర్ విశాఖ సొంతం. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఇంకా ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకోవటానికి పరుగులు తీస్తోంది. రాజధాని రాష్ట్రము మధ్యలో ఉండాలన్న వాదన లో లాజిక్ లేదు. ఉమ్మడి రాష్ట్రము లో హైదరాబాద్ ఉత్తరాంధ్ర కు లేదా మిగిలిన కొన్ని ప్రాంతాలకు ఎంతో దూరం. చెన్నై తమిళనాడు కు ఒక మూల ఉంది. ఇలా అనేక ఉదాహరణలు మన దేశం లోనే ఉన్నాయి. అసలు సామాన్యునికి రాష్ట్ర సచివాలయం తో గాని , అసెంబ్లీ తో గాని , రాజభవన్ తో గాని , ముఖ్యమంత్రి కార్యాలయం తో గాని రోజు వారి పనులు ఏమి ఉంటాయి. ఇంటర్నెట్ విప్లవం , 5 జి లాంటి విషయాలు గురించి మాట్లాడుతున్న ఈ శకం లో అధికారులు , డిపార్ట్మెంట్స్ మధ్య కరెస్పాండెన్స్ ఒక సమస్య కానేకాదు. గతం లో కొన్ని రాష్ట్రాలలో రాజధాని ఏర్పాటు చేసినప్పుడు ఉన్న ట్రాన్స్పోర్ట్ వ్యవస్థకు , ఇప్పుడు ఉన్న ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కు పోలికే లేదు. అందుకే అసలు రాష్ట్రము విడిపోయినప్పుడే విశాఖ ను రాష్ట్ర రాజధానిగా చేసి ఉంటే అసలు సమస్యే ఉండేది కాదు. గతం లో రాష్ట్ర రాజధాని గా కొత్త నగరాలు నిర్మించిన కొన్ని రాష్ట్రాలలో ఆ ప్రయోగం అనుకున్నంత సక్సెస్ కాకపోవడానికి , ఒక రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చెందిన నగరం కానీ అటువంటి నగరాలను అనుకుని వున్నా ప్రాంతాలు కానీ ఉండాలనే వాదనకు ముఖ్యమైన కారణం ఏంటి అంటే ప్రతీ రాష్ట్రానికి వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధి ఎంతో ముఖ్యం. పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర రాజధానే ' Face of the State' . First impression is the best impression అంటారు కదా? పెట్టుబడులు ఆకర్షించాలంటే రాష్ట్రము లో ఉన్న సదుపాయాలు తెలియచేయాలి , దానికి రాష్ట్ర రాజధాని ఒక అభివృద్ధి చెందిన నగరం లో ఉంటే ప్రభుత్వ పని మరింత సులభం గా అవుతుంది. కొత్త నగరాలను పునాదులతో సహా నిర్మించాలంటే ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితులలో సాధ్యమయ్యే పని కాదు. ఈ అంశాలు అన్ని పరిగణలోకి తీసుకుంటే ఆంధ్ర రాష్ట్ర రాజధాని గా విశాఖ నగరం కన్నా అనువైన ప్రాంతం ఇంకొకటి లేదు.
కొన్ని వాదనలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ వాదనలు చేసేవాళ్లు తామే తెలివైన వాళ్ళ మని , ఆ వాదనను వ్యతిరేకించేవాళ్ళు తెలివితక్కువ వాళ్లు అని అనుకుంటుంటారు. విశాఖ కు రాజధాని రాకను వ్యతిరేకించేవాళ్ళు చెప్పేది ఏంటి అంటే , రాజధాని పెట్టి నాలుగు భవనాలు కట్టినంత మాత్రాన విశాఖ లేదా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిపోతుందా ? మరి అదే నాలుగు భవనాలు ఉత్తరాంధ్ర కాకుండా వేరే చోట పెడితే ఆ ప్రాంతం మాత్రం అభివృద్ధి చెందుతుంది. ఈ వాదనను ఒప్పుకుంటే అంత అమాయకత్వం ఇంకొకటి ఉండదు. ఈ వాదనలో లాజిక్ ఏంటో ఎంత ఆలోచించిన అర్ధం కాదు. ఎందుకంటే అందులో లాజిక్ లేదు కాబట్టి. అదేమీ విచిత్రం ఒక ప్రాంతం లో రాజధాని కావాలి లేకపోతే అభివృద్ధి జరగదు అని ఉద్యమాలు చేస్తూ అదే రాజధాని వైజాగ్ లో వస్తే మాత్రం వైజాగ్ లేదా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిపోతుందా అని అనటం ఎంత తెలివైన పనో కదా ? నిజానికి రాజధాని వస్తే వైజాగ్ prantam అభివృద్ధి చెందినట్టుగా వేరే ఏ ప్రాంతం అభివృద్ధి చెందలేదు.ఎందుకో ఒకసారి ఆలోచిద్దాం.
రాజధాని తోనే ఒక ప్రాంతం అభివృద్ధి చెందదు అనే వాదనలో పాక్షిక నిజం ఉంది. ఏంటి అంటే ఒక ఖాళీ ప్రదేశం లో అంటే అంతకుముందు పెద్దగా అభివృద్ధి చెందని ప్రాంతం లో ఒక కొత్త రాజధానిని నిర్మిస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందదు అందుకు ఉదాహరణలు గా గాంధీనగర్ , రాయపూర్ వంటి రాజధానులు మనం చెప్పుకోవచ్చు. కొందరు తెలివిగా ఈ ఉదాహరణలు చూపించుతూ రాజధాని పెట్టడానికి అభివృద్ధికి సంబంధం లేదు అని వాదిస్తూ ఉంటారు. ఇక్కడే అసలు పాయింటు ఉంది. పూర్తి గా కొత్త నగరాన్ని నిర్మించాలంటే ఈ ఉదాహరణలు కరెక్టు. అంతే గాని అభివృద్ధి చెందుతున్న నగరంలో రాజధాని పెడితే అభివృద్ధి జరగదని కాదు. నిజానికి ఆ పరిస్థితిలో అభివృద్ధి మరింత వేగంతో సినర్జీ ఎఫెక్ట్ తో దూసుకువెళ్తుంది. అందుకు మన దేశంలోనే అభివృద్ధి చెందిన రాజధాని నగరాలూ ఎన్నో ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
చాలా మంది నాయకులూ , మేధావులమని చెప్పుకునే వాళ్ళు , మన కున్న ' అద్భుతమైన ' మీడియా ఈ విషయాన్ని చాలా తెలివిగా పక్కన పెట్టేస్తోంది. హైవే కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ,సంవత్సరానికి మూడు పంటలు వచ్చే పొలాల్లో రాజధాని పెడితే రాష్ట్రానికి వచ్చే అభివృద్ధి ఏమీ ఉండకపోవచ్చు కానీ , స్వతహాగా ఉన్న ప్లస్ పాయింట్స్ వాళ్ళ ఎంతో అభివృద్ధి చెందుతున్న విశాఖ లో రాజధాని పెడితే ఎందుకు అభివృద్ధి చెందదు ? ఇక్కడ అందరు రాజకీయాలు పక్కన పెట్టి విశాల ప్రయోజనాలు గురించి ఆలోచించవలసి ఉంటుంది. రాజధాని విశాఖ లో పెట్టడం వల్ల ఈ ప్రాంతానికి మాత్రమే కాదు మొత్తం రాష్ట్రానికి ఎంతో ఉపయోగం. ఎలా అంటే , విశాఖ లాంటి అన్ని హంగులు ఉన్న నగరం రాష్ట్ర రాజధాని గా ఉంటే ఇక్కడకు వచ్చే పారిశ్రామికవేత్తలను మన రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షించడం సుళువు అవుతుంది. రాష్ట్ర రాజధాని అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే అఫీసులు మాత్రమే కాదు . వేరే రాష్ట్రాలకు , దేశాలకు మనల్ని పరిచయం చేసే రాష్ట్ర ముఖ చిత్రం. ఆ ముఖ చిత్రం ఎంత సంపూర్ణంగా ఉంటే రాష్ట్రానికి అంత ఉపయోగం.ఆ సంపూర్ణత విశాఖ సొంతం. మేధావులమని చెప్పుకునే ఒక తెలంగాణ ప్రొఫెసర్ , ఒక రాజకీయ పార్టీ నడుపుతున్న మాజీ ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు కూడా ఈ విషయం లో సరైన అంచనాలు వెయ్యలేకపోవటం ఆశ్చర్యకరం.
Copyright © 2023 NANI'S VOICE - All Rights Reserved.
Powered by GoDaddy
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.